భక్తుల సేవలో ఎఫ్‌ఎంఎస్ హెల్ప్‌లైన్
తిరుమలలో భక్తుల ఫిర్యాదులను స్వీకరించి వాటిని సత్వరం పరిష్కరించే దిశగా ఎఫ్‌ఎంఎస్ హెల్ప్‌లైన్ పనిచేస్తోంది. హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబరు 1800425111111. గదుల్లో తలెత్తే సమస్యలతోపాటు దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాదం, రిసెప్షన్, కల్యాణకట్ట, విజిలెన్స్, ఆరోగ్య, ఇంజినీరింగ్ తదితర విభాగాలకు సంబంధించి భక్తులు ఫిర్యాదు చేయవచ్చు.
2017, నవంబరు 23న ఈ హెల్ప్‌లైన్‌ను టిటిడి ప్రారంభించింది. 24 గంటల పాటు ఇక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భక్తుల నుండి ఫిర్యాదులను స్వీకరిస్తారు. మొదట్లో ఎఫ్‌ఎంఎస్ విభాగం పరిధిలోని ఫిర్యాదులను మాత్రమే స్వీకరించేవారు. ప్రస్తుతం టిటిడిలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి ఆయా అధికారులను అప్రమత్తం చేసి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదు స్వీకరించిన అరగంట నుండి ఒక గంటలోపు సమస్య పరిష్కారమయ్యేలా కృషి జరుగుతోంది. భక్తుడు టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన వెంటనే నమోదు చేసుకుంటారు. వెంటనే ఆ భక్తునితోపాటు సంబంధిత అధికారికి ఎస్‌ఎంఎస్ పంపుతారు. సమస్య పరిష్కారమైన తరువాత మళ్లీ ఆ భక్తునికి ఎంఎస్‌ఎం రూపంలో సమాచారం తెలియజేస్తారు. నిర్ణీత సమయంలోపు సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారులకు కూడా ఎస్‌ఎంఎస్ పంపుతారు.
ప్రస్తుతం ఎఫ్‌ఎంఎస్, ఇతర విభాగాల సమస్యలు కలిపి రోజుకు సరాసరి 35 కాల్స్ వస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలైతే హెల్ప్‌లైన్ సిబ్బంది ఫోన్‌లోనే భక్తులకు సూచనలిచ్చి పరిష్కరిస్తారు. సమస్య స్వభావాన్ని బట్టి ఎఫ్‌ఎంఎస్ మేనేజర్‌కు, సంబంధిత సిబ్బందికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం తెలియజేస్తారు. అయితే, ఫిర్యాదు చేసిన భక్తులు సకాలంలో అందుబాటులో ఉండి అధికారులకు సహకరించి సమస్య పరిష్కారానికి సహకరించాలని టిటిడి కోరుతోంది.
సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే ఈ హెల్ప్‌లైన్‌లో నమోదు చేసుకుంటారు. సమాచారం కోసం ఫోన్ చేస్తే తిరుపతిలోని టిటిడి కాల్‌సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. భక్తుల సౌకర్యార్థం ఈ హెల్ప్‌లైన్ నంబరును టిటిడి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడంతోపాటు అన్ని యాత్రికుల వసతి సముదాయాలు, గదులు, విశ్రాంతిగృహాలు, అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పోస్టర్ల ద్వారా సమాచారం అందిస్తోంది. రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ విభాగం ద్వారా నిరంతరం ఈ హెల్ప్‌లైన్ నంబరును భక్తులకు తెలియజేస్తోంది.